మహా సహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు భాద్రపద శుద్ద పాడ్యమి సెప్టెంబర్ 14వ తేదీ 1958 వ సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. ఈయన ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.
1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 275 అష్టావధానాలు చేశారు. 8 అర్ధశత - శత - ద్విశత అవధానాలు విజయవంతంగా నిర్వహించారు. 1996 మే నెల కాకినాడ పట్టణంలో 1116 మంది పృఛ్ఛకులతో 21 రోజులపాటు 750 పద్యాలు ఏకధాటి ధారణతో మహా సహస్రావధానిగా పేరుపొందారు. అందుకే ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా ‘ధారణా బ్రహ్మరాక్షసుడు, ‘అమెరికా అవధాన భారతి’ వంటి బిరుదులను చెప్పవచ్చు. ఎన్నో పురస్కారాలను సన్మానాలను అందుకున్నారు.
ప్రత్యేకించి 1116 పద్యాలు (5000 పంక్తులు) కలిగిన స్వీయ కావ్యం ‘సాగరఘోష’ ను 8గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని 2001 లో నిర్వహించి ఔరా అనిపించారు.
బెంగుళూరు ప్రయోగశాలలో మేథాపరీక్షావధానం కూడా 2006 లో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, ఛలోక్తులు, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను ఇస్తూ వస్తున్నారు.
నిత్యం టి.వీలలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూమతం విశిష్టతను తెలియజెప్పడంలో వారివంతు సహకారాన్నిఅందజేస్తున్నారు. సాగరఘోష, ధారధారణ, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. వారి ప్రసంగాలు సీ.డీ.లు, డీ.వీ.డీల రూపంలో కూడా తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రీతిలో కృషి చేస్తున్నారు.
© 2024 Sri Sharada Parameswari Devasthanam, Guntur. All Rights Reserved. Designed and Maintained by Y Sri Ramireddy.